కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 14 : దేశ రాజ్యాంగం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, మన పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ రక్షణకు కులం, మతం ప్రాంతం, రాజకీయ పార్టీలకతీతంగా కలిసి రావాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ మారపాక రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, దేశ మార్గదర్శి అంబేద్కర్ అందరివాడు అన్నారు. కమ్యూనిజం, అంబేడ్కరిజం రెండు దగ్గరగా ఉంటాయని తెలిపారు. దళితులు, ఉప జాతులు ఎల్లప్పుడూ ఐక్యతతో వుండాలని అప్పుడే మన హక్కులను సంపూర్ణంగా కాపాడుకోగలమన్నారు.
సింగరేణి ప్రాంతమైన ఈ కొత్తగూడెంలో కార్మిక వర్గం ప్రధానమని, దళితులు కార్మిక వర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారని వారందరు తనకు ఎల్లప్పుడూ అండదండగా ఉన్నారని వారివల్లే తాను ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు చెప్పారు. దేశంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుని పోయిందని, దానిని నిర్మూలించాల్సిన వ్యవస్థ మనందరిపై ఉందన్నారు. కార్మిక వర్గ పోరాటం చేస్తూనే, కుల వ్యవస్థ నిర్మూలించాలని అంబేద్కర్ ఆలోచనను అమలు చేసినట్లు చెప్పారు. కుల నిర్మూలన, అసమానతలు లేని సమాజం కోసం మనమంతా పాటుపడాలని కోరారు. ”లాల్ – నీల్ ” ఒకటవ్వాలని లేకపోతే దేశంలో దోపిడీ కొనసాగుతూనే ఉంటుందన్నారు.
ఆనాడు దేశ పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ ఒక్కరే అన్నారు. అందుకే అందరి కోసం ఆయన పని చేసినట్లు తెలిపారు. రాజ్యాంగం అందరికీ పవిత్ర గ్రంథం. మానవ హక్కులకు గ్యారంటీ ఇచ్చిన గ్రంథం ఉందంటే అది ఒక్క రాజ్యాంగం ఒక్కటే అని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, సామాజిక, ఆర్థిక చైతన్యం రావాలని ఇందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీ, జై భీమ్ రావు భారత్ పార్టీ, టీజేఎస్, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సింగరేణి అధికారులు, ప్రైవేటు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నాయకులు పాల్గొన్నారు.
Kothugudem Urban : మనందరిపై రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు