జూలూరుపాడు, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా రామనాథం (55) అలియాస్ సుధాకర్ తీవ్ర వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. రామనాథం కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన రామనాథం తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురయ్యాడు. దీంతో సోమవారం ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స కోసం కొత్తగూడెంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తీవ్రమైన వడదెబ్బ కారణంగానే తన భర్త మృతి చెందినట్లు భార్య అనసూయ జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.