కొత్తగూడెం అర్బన్, మే 29 : భద్రాద్రి కొత్తగూడెంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సేవాలాల్ సేన బంజారా సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో 1/70 చట్టం సక్రమంగా అమలు జరగడం లేదని తెలిపారు.
గిరిజన చట్టాలను అధికారులు అమలు పరచడం లేదని, జిల్లాలోని గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో గిరిజనులకు బ్యాంక్ సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి లావుడ్యా ప్రసాద్ నాయక్, జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్ , జిల్లా కార్యదర్శి ధారావత్ నాగరాజు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు హరీశ్ నాయక్ ఉన్నారు.