రామవరం, ఏప్రిల్ 09 : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కోరింది. ఈ మేరకు బుధవారం టీజేఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్‌లతో కలిసి జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సీఎండీ బలరాం నాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, ఇతర సమస్యలపై చర్చించింది. సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులకు గత అనేక సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని, వారి వేతనాలను పెంచేందుకు, వైద్య సదుపాయం, సెలవులు, క్యాంటిన్ తదితర చట్టబద్ద సౌకర్యాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోదండరాం, జనక్ ప్రసాద్ సీఎండీని కోరారు.
దీనిపై సీఎండీ స్పందిస్తూ.. సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులు శ్రమ ఉన్నదని, వారి జీతాలను పెంచడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జీఓ ప్రకారం వేతనాన్ని చెల్లిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నూతన జీఓ ఇచ్చిన వెంటనే దానిని అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ అమలుకు ఇప్పటికే డబ్బులు చెల్లించామని త్వరలోనే ఈఎస్ఐ సౌకర్యాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు ప్రారంభిస్తామని చెప్పారు. క్యాంటిన్ సౌకర్యం, పండగ సెలవులు తదితర చట్టపరమైన సౌకర్యాల అమలుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ, ఐటీసీలతో సహా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో జీఓలకు అదనంగా రూ.3 వేల నుండి 5 వేల వరకు వేతనాలను చెల్లిస్తున్నారని, కోల్ ఇండియాలో కూడా జీఓకు అదనంగా రోజుకు రూ.724 /- చెల్లిస్తున్నట్లు కోదండరామ్, జనక్‌ప్రసాద్ సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల విషయంలో సింగరేణి సానుకూలంగా ఉన్నందున సింగరేణిలో కూడా జీఓకి అదనంగా వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై బలరాం నాయక్ స్పందిస్తూ.. జీఓకి అదనంగా వేతనాలు చెల్లించే విషయమై అధ్యయన చేయించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం (సిఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రసూరి శంకర్, సింగరేణి ప్రగతిశీల కాంట్రాక్ట్ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర నాయకుడు మధుసూదన్ రెడ్డి, టీజేఎస్ నాయకులు వి.బాబు, మల్లెల రామనాథం పాల్గొన్నారు.