రామవరం, మార్చి 25 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సోమవారం ఒక్క రోజే 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైలు మార్గం ద్వారా 14 రేకుల (ఒక రేకుకు 59 రైల్వే వ్యాగన్లు) బొగ్గు రవాణాను చేయడం జరిగింది. 10 రేకులు జే.వి.ఆర్.సి హెచ్.పి నుండి రవాణా చేయగా, మిగిలిన 04 రేకులు ఆర్.సి హెచ్.పి నుండి రవాణా చేయడం జరిగిందన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో భాగంగా జేవిఆర్ఓసి-2 నుండి గత సంవత్సరం సాధించిన 110.68 లక్షల టన్నులను సోమవారం అధిగమించి 110.95 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి మొత్తంలోనే కొత్తగూడెం ఏరియా గత సంవత్సరం సాధించిన 138 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి , 152.85 లక్షల టన్నుల రవాణాను అధిగమించినట్లు చెప్పారు. ఈ రికార్డు నెలకొల్పడంలో భాగస్తులైనటువంటి ఉద్యోగులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కంపెనీ పురోగాభివృద్ధిలో కొత్తగూడెం ఏరియా ప్రధాన భూమిక పోషించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.