కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 08 : రాపిడో, ఓలా, ఉబర్ ట్యాక్సీ సంస్థల సేవలను రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ.. సుమారు 4 కిలోమీటర్ల వైశాల్యం గల కొత్తగూడెం పట్టణానికి రాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు అవసరం లేదన్నారు. కొత్తగూడెం పట్టణం, విద్యానగర్ కాలనీ నుండి పాలకేంద్రం వరకు పాల కేంద్రం నుండి బస్టాండ్, బస్టాండ్ నుండి రామవరం వరకు నాలుగు కిలోమీటర్ల సిటీగా ఉన్న కొత్తగూడెంలో ఈ ట్యాక్సీ సేవల వల్ల ఆటోడ్రైవర్లు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిదన్నారు. కొత్తగూడెం పట్టణంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పిల్లలు, ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక ఆటోనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తరుణంలో కొత్తగూడెం టౌన్లో ఆటో డ్రైవర్లకు గుదిబండలాగా తయారైన రాపిడో, ఓలా, ఉబర్‌ను రద్దుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, అబ్బులు, కృష్ణ, హమీద్, లక్ష్మణ్, భాష, భాస్కర్, కోటి, రామరాజు, చప్పిడి కోటేశ్వరరావు, జోసఫ్ శ్రీను, గోవర్ధన్, జలీల్, కోటి పాల్గొన్నారు.
Kothagudem : కొత్తగూడెంలో రాపిడో, ఓలా, ఉబర్ సేవలను రద్దు చేయాలి : కంచర్ల జమలయ్య