రుద్రంపూర్, జూలై 20 : గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొని మాట్లాడారు. రామవరం డిస్పెన్సరీని యథావిధిగా కొనసాగించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతూ ఈ ఏడాది మే 31న ప్రధాన ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి (సీఎంఓ) డా.కిరణ్ రాజ్, ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజుకు ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఏఐటీయూసీ చేసిన నిరంతర కృషి, యాజమాన్యంపై తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగానే రామవరం డిస్పెన్సరీ తిరిగి ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
అయితే డిస్పెన్సరీ ప్రారంభించినంత మాత్రాన సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు కాదని, వెంటనే శాశ్వత వైద్యుడిని నియమించి, అవసరమైన వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడంతో పాటు తగిన మందుల నిల్వలు అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డైరెక్టర్ (పీపీ) కే. వెంకటేశ్వర్లు త్వరలోనే వైద్యుడితో పాటు అవసరమైన సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిస్పెన్సరీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేసి పునఃప్రారంభానికి సహకరించిన ఏరియా జనరల్ మేనేజర్, ప్రధాన ఆస్పత్రి సీఎంఓలకు ఏఐటీయూసీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఉపాధ్యక్షుడు కత్తెర్ల రాములు, నాయకులు హుమాయూన్, మండల రాజేశ్వరరావు, మల్లికార్జున్, అప్పారావు, సీపీఐ నాయకులు కంచర్ల జములయ్య, కార్పొరేటర్ శంకర్, అధికారులు పాల్గొన్నారు.