– కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల నిరవధిక దీక్ష
– సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 26 : ఆదివాసీలు సాగు చేసుకుంటున్న రామన్నగూడెం భూములను వారికే అప్పగించాలని, ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. 1981, 1988, 1990, 1998 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం 107 మంది రైతులకు పట్టాలు ఇచ్చిందని, ఈ రైతులందరికీ రైతు బంధు, రైతు బీమా లాంటి ప్రభుత్వ పథకాలు కూడా అందుతున్నట్లు తెలిపారు. కానీ ఈ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తూ వ్యవసాయం చేయనీయకుండా వేసిన పంటలను ధ్వంసం చేస్తూ రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం అన్నారు.
సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఆదివాసీలు వచ్చి కలెక్టరేట్ వద్ద నిరవధిక దీక్ష చేస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ అంశంపై విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటాలు, ఉద్యమాలను కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, అమరపూడి రాము, జాటోతు కృష్ణ, గోకినపల్లి ప్రభాకర్, బానోతు ధర్మా, రామన్నగూడెం రైతులు పాల్గొన్నారు.
Kothagudem Urban : ‘రామన్నగూడెం భూములను ఆదివాసీలకే అప్పగించాలి’