జూలూరుపాడు, మార్చి 22 : అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కరుణాకర్‌రెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా నేటికీ రేషన్ కార్డులు మంజూరు విషయంలో జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 8న రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి రెండు వారాలు కావాస్తున్నా రేషన్ కార్డుల పంపిణీ ఊసే లేదన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ఆదిలోనే హంసపాదులా మారిందని విమర్శించారు. అర్హులు పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏదైనా పథకానికి దరఖాస్తు చేద్దామంటే రేషన్ కార్డు లేకపోవడం శాపంలా మారిందన్నారు. ఇప్పటికైనా రేషన్ కార్డులను మంజూరు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శి పసుపులేటి వంశీ, చింటు, కొండ హనుమంతరావు, బబ్లు, అభి, సురేశ్ పాల్గొన్నారు.