బూర్గంపహాడ్, మార్చి 9 : కేజీబీవీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ.. మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. రెండు దశాబ్ధాలుగా విద్యావ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు, ఉద్యోగులు నేటికీ అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం వేతనం కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లను ప్రిన్సిపాల్ పీజీసీఆర్టీలను జూనియర్ లెక్చరర్లు, సీఆర్టీ, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణించి కనీస మూలవేతనాలు చెల్లించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 29 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిలిపివేసిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ఎన్ఎస్ఏ ఉద్యోగులకు హెల్త్కేర్డులు ఇవ్వాలని, ప్రతి కేజీబీవీ పాఠశాలలో కేర్ టేకర్లు, నైట్ వాచ్మెన్లను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు.
16న జిల్లా కేంద్రంలో జరిగే భారీ ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయ, ఉద్యోగులు, సిబ్బంది పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి.బాలు, సహ అధ్యక్షులు టి.రమేష్, మండల సహాయ కార్యదర్శి జనార్ధన్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుశీల, సిబ్బంది పరమేశ్వరి, దివ్య, చంద్రిక, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.