ఇల్లెందు, మార్చి 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని సీఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ శివారులో పలువురు నిరుపేదలు గత ఆరు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి తాగునీరు, కరెంట్, ఇతర మౌలిక వసతులు ఏవీ లేవు. కనీస వసతులు లేక, విష సర్పాల కాటుకు గురై, చలికి ఎండకు, వానకు అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఎం పార్టీ జిల్లా నాయకుడు, పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్ అన్నారు. పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న వీరిక కనీసం తాగునీరు ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు.
అడవుల్లో జీవిస్తున్న వన్య ప్రాణుల తాగునీటి కోసం చెక్ డ్యామ్లు, నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రజల తాగునీటి సౌకర్యం తీర్చకపోవడం దారుణమన్నారు. మంచినీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన దీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. నేడు వినూత్న రీతిలో మోకాళ్లలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన దీక్షలకు మన్యం మోహన్ రావు అధ్యక్షత వహించగా తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేశ్, సుల్తానా, ఆలేటి సంధ్య, కల్లెపల్లి మరియా, ఆర్బీజే రాజు, వరంగంటి రాజ మొగిలి సంఘీభావం తెలిపారు. దీక్షలో వీరభద్రం, వెంకన్న, సంతోష, సుజాత, కమల, కోటమ్మ, నీల రాణి, జ్యోతి, కల్తి ఎస్తేరు, రాజు, హుస్సేన్, గోబ్రియా, మల్లయ్య, కౌసల్య, ఖైరన్, విజయ, కృష్ణ, యాకూబ్ పాషా, భవాని, రసూల్, బి.లక్ష్మీ, అమ్మి, ప్రమీల, రాంబాయి, మంగ పాల్గొన్నారు.