వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటివరకూ సినిమా రాలేదు. కానీ వెంకీ నటించిన రెండు సినిమాలకు త్రివిక్రమ్ మాటల రాశారు. ఆ రెండూ వెంకటేశ్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచాయి. అవే.. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి. తెలుగురాష్ర్టాల్లో ఈ సినిమాలను ఇష్టపడని ఆడియన్ ఉండరు. నిజానికి కూడా త్రివిక్రమ్ డైలాగ్‌ని వెంకటేష్ చెప్పినంత టైమింగ్‌లో ఏ హీరో చెప్పలేదన్నది నిజం.
అందుకే.. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ సినిమా వస్తుందంటే, ఆ హీరో ఫ్యాన్, ఈ హీరో ఫ్యాన్ అని కాకుండా, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనే లక్ష్యంతో త్రివిక్రమ్ ముందుకెళ్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం ఓ భారీ ఇంటి సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తారట. ఈ నెల నాలుగోవారం నుంచి ఈ ఇంట్లో షూటింగ్ మొదలవుతుంది. ఈ షూట్ అనంతరం పాటల చిత్రీకరణ నిమిత్తం చిత్రబృందం విదేశాలకు వెళ్లనున్నది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతున్న విషయం విదితమే.