లింగాలఘనపురం, ఫిబ్రవరి 15 : జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కొత్తపల్లిలో బెల్ట్ దుకాణానికి గ్రామ పంచాయతీ వేలం నిర్వహించడం వివాదం రేపుతున్నది. బెల్ట్ దుకాణాలు నిర్వహించడమే అనధికారికమని, అలాంటిది వాటికి గ్రామ పంచాయతీ ఎలా వేలం వేస్తుందని స్థానికులు కొందరు ప్రశ్నిస్తున్నారు.
కొత్తపల్లిలో దుర్గమ్మ పండుగ నిర్వహించాలని సర్పంచ్ గాదెపాక విష్ణు అధ్యక్షతన గ్రామస్థులు సమావేశమయ్యారు. నిధుల కోసం గ్రామంలో బెల్ట్ దుకాణానికి వేలం వేయాలని నిర్ణయించారు. రూ.1.30 లక్షలకు గ్రా మానికి చెందిన దాసరి సురేశ్ బెల్ట్ షా పు దక్కించుకున్నాడు. ఏడాది వరకు ఇతరులెవరూ గ్రామంలో బెల్ట్ దుకాణాలు నిర్వహించొద్దని తీర్మానించారు. నెలరోజుల వరకు అభ్యంతరంలేదని, ఏడాది అంటే కుదరదని మిగతా బెల్ట్‌షాపుల నిర్వాహకులు అడ్డుకున్నారు.
తాము గతంలో చాలామందికి మద్యం ఉద్దెర ఇచ్చామని, తమకు డబ్బులు రావాలంటే మద్యం విక్రయించాల్సిందేనంటూ స్పష్టంచేశారు. అంతేగాక తమపొట్ట కొడుతున్నారని, బెల్ట్ దుకాణానికి వేలం ఎలా నిర్వహిస్తారని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడంతో విషయం బహిర్గతమైంది. ఇంత జరుగుతున్నా అటు ఎక్పైజ్ శాఖ, ఇటు లింగాలఘనపురం పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.