కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 01 : కొత్తగూడెం నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చాలని సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామవరం గోధుమ వాగు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతల వల్ల వర్షం నిండిపోయి వాహనదారులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నేషనల్ హైవే అధికారులు నామ మాత్రంగా ఇసుక, కంకర వేసి గుంతలు నింపడం వల్ల ప్రయోజనం లేదన్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
గుంతలలో నీరు నిల్వ వల్ల వాహనదారులు అరచేతిలో ప్రాణం పెట్టుకుని ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ముర్రేడు వాగుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని, జాతీయ రహదారి నిర్మాణ పనులు మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి మునిగడప వెంకటేశ్వర్లు, నేరెళ్ల రమేశ్, జిల్లా సమితి సభ్యులు భుక్యా శ్రీనివాస్, ధర్మరాజు, విజయకుమార్, పోలోజు చారి, కూరపాటి సుధాకర్ పాల్గొన్నారు.