School late | బూర్గంపహాడ్ ఫిబ్రవరి 13: పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ఓ ప్రయివేటు స్కూల్ యాజమాన్యం చిన్నారులు అని కూడా చూడకుండా మూడు గంటల పాటు మండుటెండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చిన ఘటన మండల పరిధిలోని మోరంపల్లిబంజర్లో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోరంపల్లిబంజర్ గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న స్టైల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ముగ్గురు చిన్నారులు స్కూల్కు ఇవాళ ఆలస్యంగా వెళ్లడంతో ఆ పాఠశాల యాజమాన్యం ఆ ముగ్గురు పిల్లలను గేటుబయటకు పంపి మూడు గంటల పాటు మండుటెండలో నిలబెట్టి శిక్షించారు.
ఈ విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల హెచ్ఎంను ప్రశ్నించడంతో ఆమె దురుసుగా ప్రవర్తించి టీసీ కూడా ఇచ్చి పంపుతానని బెదిరించినట్లు కూడా తెలిసింది. పాఠశాల సమయం దాటి పిల్లలు వస్తే మందలించాలే తప్ప ఇలా అమానుషంగా ప్రవర్తించి చిన్న పిల్లలు అని కూడా చూడకుండా గంటల తరబడి ఎండలో నిలబెట్టడమేమిటంటూ విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఆ పాఠశాల ఉపాధ్యాయుల్లో కొందరు యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో కూడా ఈ పాఠశాలలో పిల్లలు ఫీజులు చెల్లించలేదని ఆరుబయట నిలబెట్టి వెనక్కు పంపిన పరిస్థితి కూడా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో పాఠశాల నడుపుతూ నిర్లక్ష్యంగా పిల్లలను హింసిస్తున్న ప్రయివేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి యదుసింహరాజును ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా చిన్న పిల్లలను ఆలస్యంగా వచ్చినందుకు ఎండలో నిలబెట్టారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
పాఠశాలను విజిట్ చేసి హెచ్ఎంను మందలించి యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించడం జరిగిందని వివరణ ఇచ్చారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం