జూలూరుపాడు, మే 23 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు సీఎం రేవంత్రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ.. చరిత్రకెక్కిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి పేరిట గులాబీ అధిపతి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు దిగడం సిగ్గుచేటన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ధాన్యం దిగుబడిలో రాష్ట్రం ఆదర్శంగా నిలువగా, కేసీఆర్ ప్రత్యేక కృషి ఫలితంగా దేశానికి తెలంగాణ రైతు అన్నం పెట్టే స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నివారించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయగా, జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై కక్షగట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణంతో అధిక దిగుబడి రాగా, ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. ఓవైపు అకాల వర్షాలు పడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. అన్నదాతలు రోడ్లపై ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కనికరించక పోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించిన రేవంత్ రెడ్డి అమలులో చేతులెత్తేయగా, గత ప్రభుత్వ పథకాలు సైతం అమలు చేయలేని దుస్థితికి చేరుకున్నట్లు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోడు రైతులకు పట్టాలు అందించి పొజిషన్ చూపించగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో సదరు రైతులను అటవీ అధికారులు వేధిస్తున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.