భద్రాచలం: గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అవకతవకలు లేకుండా సిద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. శనివారం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ డీడీ కార్యాలయంలో వివిధ క్యాటగిరీల ఉపాధ్యాయుల, సిబ్బంది సీనియారీటీ జాబితాను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నఉపాధ్యాయుల సబ్జెక్టుల వారీగా జాబితా, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, క్రాఫ్ట్ టీచర్లు, దివ్యాంగులు, పీఈటీలు, పీడీలకు సంబంధించిన జాబితాను వారి సీనియారిటీ ప్రకారం సిద్ధం చేసి తనకు పంపించాలని డీడీ రమాదేవిని ఆదేశించారు.
అభ్యర్థుల సీనియారిటీ జాబితాను వరసక్రమంలో పొందుపరచాలని, సీనియారిటీ జాబితాలో తనకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరు తనకు ఫిర్యాదు ఇచ్చేటట్లు చేయవద్దని, అందరికీ న్యాయం చేకూరేలా జాబితా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంఆర్సీ రమణయ్య, క్రీడల అధికారి డాక్టర్ వీరునాయక్, సిబ్బంది నారాయణ, రమణమూర్తి, బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.