– అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
ఆళ్లపల్లి, జులై 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని అడవి రామవరం గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో వేలాడుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా విద్యుత్ తీగ పూర్తిగా వేలాడడంతో ప్రమాదం జరగకుండా గ్రామస్తులు చెక్క కర్రలతో తాత్కాలికంగా సపోర్ట్ ఉంచారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్నప్పటికి విద్యుత్ శాఖ అధికారులు శాశ్వత మరమ్మతు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గాలి, వర్షం సమయంలో ఈ కర్రలు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న తీగలు వేలాడకుండా స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.