Yatra | హనుమకొండ చౌరస్తా: తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్ (Chairman) గుడిమళ్ల రవికుమార్ తెలిపారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆయన నివాసంలో అడ్హక్ కమిటీ సభ్యులు వోడపెల్లి శ్యాం కృష్ణ అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అడ్హక్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. వాస్తవానికి ఈ యాత్ర ఆగస్టు 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. సభ్యుల సలహాలు, సూచనల మేరకు ఈ యాత్రను సెప్టెంబర్ 17 నుంచి చేపట్టనున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజు, రజాకార్ల హత్యాకాండ నుంచి విముక్తి పొందినరోజు, నిజాం నవాబుల పరిపాలన అంతమైన రోజు గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టలోని నాటి హైదరాబాద్ ప్రాంత ప్రజలు స్వేచ్ఛా దినంగా జరుపుకొంటున్నారని ఆయన చెప్పారు.
ఈ చారిత్రక రోజు నుంచే తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్రను వరంగల్లో 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యమకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపించాడు. నాటి ఘటనలో తూటాలకు బలైన ఉద్యమకారుల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన చిహ్నం సాక్షిగా ఈ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ విజయం కోసం 20 మందిని ఇన్చార్జిలు (Incharge)గా, జిల్లాల వారీగా 10 మంది ఇన్చార్జిలను నియమించడానికి సమావేశం తీర్మానించింది. సమావేశంలో కమిటీ సభ్యులు చాంద్ పాషా, ఎర్ర మనోహర్, అంజద్, రాంకుమార్, రాజమౌళి, స్వర్ణలత, పద్మ, ప్రభాకర్, నూతన్ ప్రసాద్, ఇమ్రాన్, తొలిదశ ఉద్యమకారుల హనుమకొండ కమిటీ కన్వీనర్ రామబ్రహ్మాచారి, రాయబారపు సుదర్శన్, న్యాయవాదులు అనుముల రమేశ్, రామగిరి ప్రభాకర్ పాల్గొన్నారు.