కొత్తగూడెం టౌన్, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లోని (Sujatha Nagar) విత్తనాల, ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేశారు. రైతులు సాగు పనులు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో నఖిలీ విత్తనాలను నివారించేందుకు గాను ఫెర్టిలైజర్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా షాప్ లైసెన్సులు, షాపులో నిర్వహించే స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను, విత్తనాల ప్యాకెట్లను, ఎరువులకు సంబంధించి రిజిస్టర్లను, పెస్టిసైడ్స్ వివరాలను, గోడౌన్ లైసెన్సులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు అమ్మిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విక్రయంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు.