రామవరం, డిసెంబర్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, గౌతమ్‌పూర్‌లో నివాసం ఉండే వృద్ధ దంపతులు జీడి దుర్గయ్య, పోచమ్మ. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఇరువురికి పెండ్లిండ్లు అయ్యాయి. అవసాన దశలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను వదిలి కొడుకు తన ఆచూకీ కూడా తెలియకుండా ఎక్కడో బ్రతుకుతున్నాడు. ఏ ఆధారం లేని వృద్ధ దంపతులు చిన్నా చితక పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కాగా పోచమ్మ పక్షవాతంతో మంచాన పడింది. ఆమె ఆలనా పాలనా భారం మొత్తం దుర్గయ్య పైనే పడింది.
దుర్గయ్యకు కూడా రెండు మోకాళ్లు పని చేయకపోవడంతో లేచి నిలబడి నడవడం సైతం కష్ట సాధ్యంగా మారింది. ప్రభుత్వం అందించే రూ.2 వేల పింఛనే వీరి జీవనాధారం. ఇప్పటివరకు ఎక్కడికైనా వెళ్లాలన్నా ఓ దాత అందించిన వీల్చైయిర్ నే దుర్గయ్య ఆలంభనగా చేసుకుంటూ నెట్టుకొస్తున్నాడు. ఆ వీల్ చైర్ ఇప్పుడు సరిగ్గా పని చేయకపోవడంతో బయటకు వెళ్లే మార్గమే మూసుకుపోయింది. మందులు తెచ్చుకోవడం, అవసరమైన సరుకులు కొనుగోలు చేయడం పెద్ద సమస్యగా మారింది. దాతలెవరైనా స్పందించి ట్రై సైకిల్‌ను అందించాల్సిందిగా దుర్గయ్య, అలాగే పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.