– ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ
ఇల్లెందు, ఫిబ్రవరి 05 : హామీలు ఇచ్చి నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పలు వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకై ప్రచారం నిర్వహించారు. 19వ వార్డులో పింగళి అనూహ్య గెలుపు కోసం ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇల్లెందు పట్టణ అభివృద్ధిలో గత ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించామని, 19వ వార్డులో తమ పాలన హాయంలో జరిగిన అభివృద్ధి పనులను, కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలైనా నేటికీ పూర్తి చేయలేదని విమర్శించారు.
మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే క్రమంలో నాడు జీఓ నెంబర్ 76 ప్రకారం చాలా మందికి పట్టాలు ఇచ్చామని, అప్పుడు దరఖాస్తు పెట్టుకున్న చాలామంది నేటికీ ఈ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయలేదని దుయ్యబట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కే ఓటు వేసి గెలిపించాలని, ఈ ప్రాంత బిడ్డ పింగిలి నరేష్ సతీమణి పింగిలి అనూహ్య గెలిపించాలని కోరారు. అలాగే ఇల్లెందు 24వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరిసింగ్ నాయక్, పింగిలి నరేష్, ఎస్.రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, శీలం రమేష్, లాల్ సింగ్, అజ్మీర సత్యవతి, వివిధ వార్డుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

‘హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’