చుంచుపల్లి, మే 09 : చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామం నాయకులగూడెంలో గత మూడు రోజులుగా పెద్దమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. పెద్దమ్మతల్లి, పులి రాజు వివిధ వేషధారణలతో గ్రామం మొత్తం మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. జాతరలో భాగంగా శనివారం సాయంత్రం అడవిలో నుండి సరుగులు, కర్రలను సంప్రదాయబద్ధంగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నిప్పుల గుండం ఏర్పాటు చేసి భక్తులు పూలు తొక్కే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే పెద్దమ్మ తల్లి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించి, మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టనున్నట్లు సర్పంచ్ రెడ్డి సుజాత తెలిపారు.