బూర్గంపహాడ్, మార్చి 30 : గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న సారపాకకు చెందిన షేక్ మున్వర్‌పై బూర్గంపహాడ్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పాల్వంచ సీఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సారపాకకు చెందిన షేక్ మున్వర్ 2024, 2025 సంవత్సరాల్లో బూర్గంపహాడ్ పోలీసుస్టేషన్లో రెండు, 2024లో లక్ష్మీదేవిపల్లి పోలీసుస్టేషన్లో ఒకటి, 2024లో ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో ఒకటి చొప్పున గంజాయి అక్రమంగా రవాణా చేసినందుకు కేసులు నమోదయ్యాయి. చివరిగా 2025 ఏప్రిల్‌లో దుండిగల్ పోలీసుస్టేషన్లో 98 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ దొరకగా అక్కడ కూడా కేసు నమోదు అయ్యాయి. ఈ ఐదు కేసుల్లో షేక్ మున్వర్ మొత్తం 287 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ అక్రమార్జనకు పాల్పడటంతో పీఐటీ ఎన్డీపీఎస్ యాక్ట్ కోసం పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీశ్‌కుమార్ సూచనతో పాల్వంచ సీఐ కె.సతీశ్ ప్రతిపాదించగా జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ పర్యవేక్షణలో ప్రతిపాదిత ఆధారాలు క్షుణ్ణంగా పరిశీలించి సీఐడి అడిషనల్ డీజీపీ చారుసిన్హా గత ఫిబ్రవరి 16న డిటెన్షన్ ఆర్డర్(నిర్బంధ ఉత్తర్వులు)ను జారీ చేసి 18న ఆ ఆర్డర్ ప్రతులను షేక్ మున్వర్‌కు అందించి చర్లపల్లి సెంట్రల్ జైల్‌కు ఆయన్ను తరలించినట్లు సీఐ తెలిపారు.
మార్చి 17న అడ్వజరీ బోర్డు (సలహా మండలి) షేక్ మున్వర్‌పై వచ్చిన నిర్బంధ ఉత్తర్వులపై విచారణ జరిపి భౌతిక, సాంకేతిక ఆధారాలను పరిశీలించి పీడీ యాక్టు -సమర్ధిస్తూ ఏడాది కాలం చర్లపల్లి జైలులో నిర్బంధించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ప్రజల ఆరోగ్యమే ప్రధానమని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపే గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సేవించినా, రవాణా చేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీడీ యాక్టులు నమోదు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా పట్టుబడిన నిందితులు గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులు కోర్టు ఉత్తర్వులతో జప్తు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.