Puvvada Ajay | సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతకు నిదర్శనమని ఆయన అన్నారు.
“ఆడబిడ్డ భారం కాదు.. భరోసా” అనే భావనకు గత కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూపం ఇచ్చిందని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహం ఆర్థిక భారంగా మారకుండా అండగా నిలిచిన ఈ పథకాలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేసినా లేదా రద్దు చేసే ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పువ్వాడ హెచ్చరించారు.
కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.