జూలూరుపాడు, మే 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన పెయింటర్ కల్లోజి నరేశ్ (37) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల్లో పని చేయడం వల్ల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మొదట స్థానిక వైద్యుల వద్ద ప్రథమ చికిత్స అందించారు. ఒక్కసారిగా నరేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నరేశ్ తుదిశ్వాస విడిచాడు. నరేశ్‌కు భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. నరేష్ హఠాన్మరణంతో న్యూ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. నలుగురు చిన్న పిల్లలు ఉన్న ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.