భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వాద్య కళాకారుడు రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం 107 మందికి పద్మశ్రీ ప్రకటించగా వారిలో రామచంద్రయ్య స్థానం దక్కించుకున్నారు. ఈయన వోకల్, ఫోక్ కళాకారుడు. ‘కంచు తాళం కంచు మేళం’ అనే వాద్య సాధనాన్ని వాయిస్తూ ప్రాచీన కళను కాపాడుతున్నారు. పద్మశ్రీ దక్కిందన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆయన ఇంటికి వెళ్లి సన్మానించారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన ఎంపికపై భద్రాద్రి కలెక్టర్ అనుదీప్‌తో పాటు జిల్లాఅధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిరక్షరాస్యుడైనా..
రామచంద్రయ్య ఆదివాసీ చరిత్రపై పట్టుసాధించి అరుదైన వాద్య పరికరంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా పర్యటించాడు. కోయ తెగల చరిత్రను, విశిష్టతను వినసొంపైన రాగంలో వినిపించేవాడు. చదువు రాదు. పుస్తకాలు చదవలేదు. అయినా.. గిరిజన బిడ్డల చరిత్ర అంతా ఆయన నోటిలోనే ఆడుతుంది. నోరు విప్పితే ఆదివాసీల చరిత్ర పుటలు బయటకు వస్తాయి. ఆదివాసీలు పూజింజే దేవతలు, వారి సంప్రదాయాలు నేటికి పది మందికి చెప్పగలికే తెలివి తేటలు ఆయనలో దాగి ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు చదివినా మరునాడు ఉదయానికి మర్చిపోయే ఈ రోజుల్లో పాతకాలపు మనిషిగా రామచంద్రయ్య ఆదివాసీ తెగలో గొప్ప పేరును తీసుకు వచ్చాడు. రామచంద్రయ్యకు నాలుకపైనే కోయ తెగకు సంబంధించిన వందలాది మౌఖిక చరిత్రలు నానుతుంటాయి. తెలుగు, కోయ భాషలో అతని స్వర గదుల నుంచి అప్రయత్నంగా క్యాస్కేడ్ చేయడానికి కథను మాత్రమే ప్రస్తావించాలి. కోయ తెగకు (డోలి) ఉప కులానికి చెందిన, ఆయన తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే రామచంద్రయ్య బహుశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో మిగిలిపోయిన చివరి గాయకుడు.
వ్యయప్రయాసల కోర్చి..
ప్రదర్శనలు ఇవ్వడానికి కొన్నిసార్లు ఛత్తీసగఢ్ సరిహద్దు దాటాల్సి వచ్చిందని, అక్కడి ప్రజలు కోయ భాషలో పాటలు కోరుకుంటున్నారని రామచంద్రయ్య చెప్తాడు. ఇప్పటికీ శుభాకార్యాలు, అంత్యక్రియల వద్ద పాడతాడు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో వారి గాథను వివరిస్తాడు.ఈ ఏడాది మేడారం జాతరలోనూ వారి గాథను వివరించే అవకాశం ఉన్నది. రామచంద్రయ్యను తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను ఎంతో ఇష్టపడే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఎంతోగానే అభిమానించేవారు.