జూలూరుపాడు, ఏప్రిల్ 29 : ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో ఉత్తర కొరియాకు చెందిన ముగ్గురు టూరిస్టులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆళ్లపల్లి మండలంలోని రామానుజగూడెం గ్రామానికి చెందిన వానపాకుల సాంబశివరావు (25) కుటుంబ సమేతంగా హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. బూర్గంపాడు మండలం ఏలేరు గ్రామంలో తన మరదలు పెళ్లి కోసం నాలుగు రోజుల క్రితం కుటుంబ సమేతంగా వచ్చి తిరిగి తన కారులో హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సౌత్ కొరియాకు చెందిన ముగ్గురు టూరిస్టులు భద్రాచలం రాములోరిని దర్శించుకునేందుకు ఖమ్మం నుండి భద్రాచలం కారులో వెళ్తుండగా వినోబానగర్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు కావడంతో కారులో ఉన్న శ్రీలత, సంధ్య, సాంబశివరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సాంబశివరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సౌత్ కొరియా టూరిస్టులు ముగ్గురు, వారు ప్రయాణించే కారు డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు 108లో కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.