- అధికారుల అలసత్వంపై జూలూరుపాడు రైతుల ఆగ్రహం
జూలూరుపాడు, మే 02 : నింగి నిండా కారుమబ్బులు.. వీస్తున్న ఉగ్రరూప వడగాల్పులు.. రోడ్డు మీద మట్టిని రజనులా ఎగరేస్తున్న గాలి దుమారం.. ఇదీ శనివారం మధ్యాహ్నం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద కనిపించిన భీతావహ దృశ్యం. వర్షం ఇంకా పడలేదు, కానీ పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో, చేతికొచ్చిన పంట ఏమైపోతుందోనన్న భయం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సాధారణంగా ఎండకు ఆరబోయాల్సిన మొక్కజొన్నలు ఇప్పుడు దుమ్ము ధూళికి బలవుతున్నాయి. ఒక్కసారిగా వీచిన గాలులకు రోడ్డుపై ఉన్న మట్టి, చెత్తాచెదారం కొనుగోలు కేంద్రంలోని పంటపైకి చేరుతుండటంతో రైతులు హుటాహుటిన పట్టాలు కప్పాల్సి వచ్చింది. గింజ నాణ్యత దెబ్బతింటే కొనుగోలు అధికారులు అభ్యంతరాలు చెబుతారన్న ఆందోళనతో వాన రాకముందే రైతులు నానా యాతన పడుతున్నారు. ఆకాశం వైపు చూస్తూ, “వద్దు నాయనా.. ఇప్పుడే కురవద్దు” అని వేడుకుంటున్న దృశ్యాలు అక్కడి వారిని కలచివేస్తున్నాయి.
మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జల్లులు పడడంతో, ఇక్కడ కూడా ఏ క్షణమైనా వాన ముంచెత్తుతుందన్న భయంతో రైతులు పట్టాలను కప్పి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సహకార సంఘం ఆవరణ 5 అడుగుల లోతులో ఉండడం ఇప్పుడు శాపంగా మారింది. వాన పడితే నీరంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది. పంట తడవక ముందే తడిసిపోతుందన్న భయం రైతును మానసికంగా కుంగదీస్తోంది. 15 రోజులుగా ధాన్యం ఆరబోసి ఉన్నా లారీలు రాకపోవడంతో ఆ పట్టాల కిందే పడిగాపులు కాస్తూ అన్నదాతలు తమ ప్రాణప్రదమైన పంటను కాపాడుకుంటున్నారు.
కేంద్రం ప్రారంభించి 20 రోజులు కావస్తున్నా కేవలం ఒక్క లోడు మాత్రమే వెళ్లడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. తాము ఇక్కడ వానకు, ఎండకు, దుమ్ముకు పడి ఉంటుంటే అధికారులు మాత్రం కదలడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై గాలి దుమారం రేగుతున్నా యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం. పంట పండించడం ఒక ఎత్తయితే, దానిని విక్రయించడం మరో యుద్ధంలా మారింది. ప్రకృతి ప్రకోపించక ముందే అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోతే, ఈ లోతట్టు ప్రాంతంలోని మొక్కజొన్న రాశులు నీటి పాలు కాక తప్పదు. అన్నదాత కళ్లల్లో కనిపిస్తున్న ఈ ఆందోళన తీరాలంటే, తక్షణమే లారీలను పంపి ధాన్యాన్ని తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు వేడుకుంటున్నారు.