జూలూరుపాడు, ఏప్రిల్ 06 : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని వైద్య సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు గంట పాటు ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి, లోపాలను ఎత్తిచూపారు.
తనిఖీలో భాగంగా ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చిన కలెక్టర్‌కు ప్రమాదంలో కాలు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు ఎవరూ లేరని, వైద్యం చేయించుకునే స్తోమత లేదని కన్నీరు మున్నీరవడంతో కలెక్టర్ చలించిపోయారు. తక్షణమే స్పందించి ఆ వృద్ధుడికి సంబంధించిన పూర్తి డేటాను సేకరించి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించాలని ఆదేశించారు. నిరుపేదలకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఇన్ పేషెంట్ వార్డులో వడదెబ్బ కేసులు పెరుగుతుండడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా మండలంలో చలివేంద్రాల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ఎంపీడీఓ తాళ్లూరి రవి అప్రమతంగా ఉండాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వెంటనే చేపట్టాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు.. యుద్ధ ప్రాతిపదికన చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : కలెక్టర్ అంకిత్
ఆస్పత్రిలోని ఔషధ నిల్వ గదిని తనిఖీ చేసిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్‌ను వాస్తవ నిల్వలతో సరిపోల్చారు. ప్రభుత్వ మందులు బహిరంగ మార్కెట్లోకి తరలిపోతున్నాయనే ఆరోపణలు రాకూడదని, నిల్వల్లో తేడాలు వస్తే సంబంధిత అధికారులనే బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. ఔషధాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, రోగులకు బయట మందులు రాయకూడదన్నారు.
సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించిన ఆయన, విధులకు గైర్హాజరైన వారి వివరాలను ఆరా తీశారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అత్యవసర సమయాల్లో వైద్యులు, నర్సులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : కలెక్టర్ అంకిత్