– కనీస వేతనాలు, చట్టబద్ద సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం
– కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలి
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె రమేష్, అధ్యక్షుడు కె.బ్రహ్మచారి
పాల్వంచ, ఏప్రిల్ 30 : పాల్వంచలోని నవ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజె రమేష్, అధ్యక్షుడు కె.బ్రహ్మచారి, సీనియర్ నాయకులు ఎం.వీ.అప్పారావు హెచ్చరించారు. నవ భారత్ కోల్ హ్యాండలింగ్ ప్లాంట్ గేట్ ముందు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డ రవి కుమార్ అధ్యక్షతన గురువారం ధర్నా, ఆందోళన నిర్వహించారు. అనంతరం జరిగిన మీటింగ్లో నాయకులు మాట్లాడారు. నవ భారత్ కంపెనీలో కేవలం 42 మంది మాత్రమే పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉన్నారని, రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. వీరి శ్రమతోనే కంపెనీలో ఉత్పత్తి వస్తున్నదని, తద్వారా కంపెనీ లాభాలను సాధిస్తున్నదన్నారు. అటువంటి ఈ కార్మికులకు
క్యాటగిరైజేషన్ అమలు కావడం లేదని, అందరు కార్మికులు అన్ స్కిల్డ్ కార్మికులుగానే పని చేయిస్తున్నారన్నారు.
పే స్లిప్ లు ఇవ్వడం లేదని, గ్రాట్యుటీ, వీక్లీ ఆఫ్ లు అమలు కావడం లేదన్నారు. చట్టబద్ద సౌకర్యాలు ఏమీ అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు. వీటన్నింటిని సాధించుకోవడం కోసం సీఐటీయూ యూనియన్ పెడితే, ఈ యూనియన్ కి నాయకత్వం వహిస్తున్న కార్మికులను విడివిడిగా పిలిచి కౌన్సిలింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ బెదిరింపులకు అదిరేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా యాజమాన్యం యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల పెద్ద ఎత్తున దశల వారీ పోరాటల్లోకి వెళ్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. కార్మిక శాఖ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సీఐటీయూ నాయకులు పొదిల తులసీరామ్, కె.సత్య, బాస నారాయణ, నవ భారత్ కార్మిక సంఘం నాయకులు ఎస్.గోపాల కృష్ణ, కె.సుధీర్ కుమార్, జే.దేవిలాల్, ఏ.యాకుబ్, బి.సురేష్, బి.వినోద్, అజయ్ పాల్గొన్నారు.

‘కార్మికుల హక్కులను కాలరాస్తున్న నవభారత్ యాజమాన్యం’