కొత్తగూడెం అర్బన్, మే 13 : ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రీజియన్ ప్రధాన కార్యదర్శి పెద్దబోయిన సతీశ్, జిల్లా ఉపాధ్యక్షుడు వై.గోపాలరావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాయకులు మంగళవారం దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్ను వివిధ కార్మిక అడ్డాల్లో ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని తదితర డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఈ సమ్మెలో ప్రతీ కార్మికుడు పాల్గొనాలని కోరారు. దేశంలో బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు.
బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకులు తదితర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, చంద్రకళ, సంధ్య, పోశం, దేవి, గంగ, మంగ, భగవాన్, జవహర్లాల్, సునీత, విజయ్, శిరీష, నరసమ్మ, రమణ పాల్గొన్నారు.