జూలూరుపాడు, ఫిబ్రవరి 14 : మిర్చిని ప్రభుత్వం మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని లేకుంటే రైతుల పక్షాన ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు యాస నరేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కోసం మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.25వేల చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిచారు.
మిర్చి ధరల క్షీణతపై రైతాంగం యావత్తు ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పంటలకు వ్యాపించిన, చీడపీడలు, పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో క్వింటాకు కనీసం రూ.25వేలు చెల్లిస్తేనే రైతులకు కొంతమేరకైనా గిట్టుబాటు అవుతుందన్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ రూ.23వేలు ధర ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చొరవ చూపి మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్‌కు లక్షల బస్తాలకు పైగా మిర్చి అమ్మకానికి రాగా జెండా పాట రూ.14వేలకు పైగా పలికినా ఎక్కువ మొత్తం మిర్చిని క్వింటాల్ రూ.10వేలలోపు ధరకే కొనుగోలు చేశారని తెలిపారు.
రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, ఇప్పటికే వరికి అది కూడా సన్నాలకు మాత్రమే ఇస్తున్న బోనస్‌ను కూడా సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వల్లమల చందర్ రావు, గార్లపాటి వెంకటి, గడిదేశీ కనక రత్నం, అనగంటి సత్యనారాయణ , బోడ అభిమిత్ర, పెరుమాళ్ల పవన్, తదితరులు పాల్గొన్నారు