భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను, ఆహ్వాన పత్రికలను దేవాదాయశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం ఎంతో వైభవంగా జరుపుతారు. జనవరి 3 నుంచి భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
మంగళవారం ఎండోమెంట్ కమిషనర్ అనీల్‌కుమార్, భద్రాచలం దేవస్థానం ఈఓ, ఆలయ అర్చకులు దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దేవస్థానం అర్చకులు మంత్రికి వేదాశీర్వచనంతోపాటు, రామయ్య ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఈఓను అడిగి తెలుసుకున్నారు.
తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ అనీల్‌కుమార్,ఉప ప్రధానార్చకులు గోపాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.