జూలూరుపాడు, మే 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త, దళిత నాయకుడు చెంగల నరసింహారావు గత కొంతకాలంగా మెదడులో కణితితో బాధపడుతున్నాడు. ఈ విషయమై నర్సింహారావు కుటుంబ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడి తక్షణ వైద్యం అందించాల్సిందిగా కోరారు. ఎంపీ సూచన మేరకు నరసింహారావుకు ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు.
ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న నరసింహారావును సోమవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అయ్యేంత వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. ఆయన వెంట హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉస రఘు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు దిండిగల రాజేందర్, వైరా నియోజకవర్గ నాయకుడు లాకావతు గిరిబాబు, సీనియర్ జర్నలిస్ట్ బాపట్ల మురళి ఉన్నారు.