భద్రాచలం, మార్చి 9 : గోదావరి పరివాహక ప్రాంతమంతా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతూ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్కు ఇసుక మాఫియాపై ఉన్న ప్రేమ, ప్రజలపై ఏదీ అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కమీషన్లు, ఇసుక దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుగా ఉందని దుయ్యబట్టారు. భద్రాచలం పట్టణం శాంతినగర్లో రావులపల్లి రాంప్రసాద్ స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్పవన్నా నానుడి మరోమారు రుజువైందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతుంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఉమ్మడి ఏపీలోని దుర్భిక్ష పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చందన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 30% మించి రైతు రుణమాఫీ కాలేదన్నారు. మళ్లీ పాత రోజులు పల్లెల్లో దర్శనమిస్తున్నట్లు తెలిపారు. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఒక్క వాటర్ ట్యాంక్ కూడా రాలేదని, ఇప్పుడు నగరం నలుమూలలా ఎటు చూసిన వాటర్ ట్యాంకులే దర్శనమిస్తున్నట్లు తెలిపారు.
రూ.2 వేల పింఛనును రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కాలయపన చేస్తున్నారే తప్పా పెంచడం లేదన్నారు. రాష్ట్ర సచివాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టడం అంటే తెలంగాణ పరువును కాంగ్రెస్ ప్రభుత్వం నడి బజారులో తీసేసిందన్నారు. గర్భిణీలకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన కేసీఆర్ కిట్టు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణ అంతా నీళ్లు లేకుండా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం మరో పోరాటం చేసే సమయం ఆసన్నమైందని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్స వేడుకకు అంతా సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27న లక్షలాది మంది మధ్య వరంగల్ నగరంలో భారి బహిరంగ సభ జరుగనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీగా బహిరంగ సభ విజయవంతం చేయడానికి ప్రజలందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, మండల సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమకుమార్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, మండల నాయకులు అయినలా రామకృష్ణ, గోసుల వెంకట శ్రీనివాస్, చిట్టిమల్ల అనిల్, మహిళా నాయకులు పూజల లక్ష్మీ, ప్రియాంక పాల్గొన్నారు.