రుద్రంపూర్, జూన్ 08 : మాదకద్రవ్యాలు, మద్యం సేవించేందుకు అడ్డుగా ఉందనే కారణంతో కొందరు ఆకతాయిలు గోడను కూల్చివేసిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్‌లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం భారత్ గ్యాస్ గోడౌన్ పరిసర ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటూ “నమస్తే తెలంగాణ”లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు గ్యాస్ గోడౌన్ లోపలికి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా గోడను నిర్మించారు. గోడ నిర్మాణం అనంతరం ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అయితే సాయంత్రం వేళల్లో మద్యం, మాదకద్రవ్యాలు సేవించే వారికి ఆ ప్రదేశం అందుబాటులో లేకపోవడంతో కొందరు ఆకతాయిలు గోడను ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
గోడ కూల్చివేయబడిన తర్వాత మళ్లీ గ్యాస్ గోడౌన్ ప్రాంగణంలో మద్యం సీసాలు, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన వస్తువులు కనిపిస్తున్నాయని అక్కడి ఉద్యోగులు తెలిపారు. గ్యాస్ గోడౌన్ వంటి సున్నితమైన ప్రాంతంలో మత్తులో ఉన్న వ్యక్తులు నిర్లక్ష్యంగా సిగరెట్ పీకలు లేదా ఇతర మండే వస్తువులు పడేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు వెంటనే స్పందించి గోడను పునర్నిర్మించడంతో పాటు ఆ ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్‌ను నిత్యం నిర్వహించాలని వారు కోరుతున్నారు.