రామవరం, జూన్ 14 : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, సింగపూర్, న్యూజిలాండ్, జపాన్, ప్రాన్స్, సౌత్ కొరియా వంటి దేశాల్లో ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్డీ చేయుటకు 2 సంవత్సరాలకు గాను రూ.20 లక్షల ఉచిత ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ చార్జీల కోసం అదనంగా రూ.60 వేలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ ఉపకార వేతనం పొందుటకు విద్యార్థి కుటుంబ సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలన్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు బీటెక్, ఎంటెక్ లలో 60 శాతం మార్కులు పొంది జీఆర్ఈ, జీఎంఏటీలలో తత్సమానమైన అర్హత పొందడం టోఫెల్/ఐఈల్ టీఎస్ స్కోర్ కార్డ్ కలిగి యూనివర్సిటీల్లో జనవరి 1, 2025 నుండి 30 జూన్, 2025 లోపు అడ్మిషన్ పొందిన వారు తమ కాలేజీ అడ్మిషన్ లెటర్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ కాఫీ, నివాస ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం, బీటెక్ మార్కుల జాబితాతో www.telanganaepass.cgg.gov.in అనే వెబ్ సైట్ నందు ఈ జూన్ 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆన్లైన్ చేసిన హార్డ్ కాపీలను సంబంధిత పత్రాలను జతచేసి నిర్ణిత గడువులోగా ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్సి, బౌద్ధ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 8520860785 అనే నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.