– ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కొండ మల్లికార్జున రావు
– పివికే-5 గనిలో కార్మికుల వినూత్న నిరసన
రుద్రంపూర్, మార్చి 28 : సింగరేణి కార్మికుల కుటుంబాల జీవన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కొండ మల్లికార్జున రావు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల మెడికల్ అన్‌ఫిట్ కారణంగా సంస్థపై ఆర్థిక భారం పడుతోందని చేసిన వ్యాఖ్యలు కార్మిక వ్యతిరేకమని ఆయన అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం కొత్తగూడెం ఏరియాలోని పివికే-5 గని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఆధ్వర్యంలో కార్మికులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. కార్మికులు మొఖాలకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్లకార్డులతో ఆందోళన చేపట్టి, అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దొంగ నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యకరమని విమర్శించారు.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అండర్‌గ్రౌండ్‌లో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్లను సర్ఫేస్ కన్వర్షన్ చేసి, ఏరియాలో ఖాళీల భర్తీలో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, పివికే-5 పిట్ కార్యదర్శి భుక్య రమేశ్, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్, అసిస్టెంట్ ఫిట్ సందీప్, సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్, మహేశ్, సుమన్, కుమార్ రావు, జనరల్ షిఫ్ట్ ఇన్చార్జ్ సంజీవ్, సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ దేవ్ సింగ్, గణేశ్, నరేశ్, ఫక్రుద్దీన్, శివ, వినోద్, సురేశ్, సంతానం, దాసరి శీను, నాగార్జున పాల్గొన్నారు.