పాల్వంచ, జనవరి 07 : హైదరాబాద్ మెహదీపట్నంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీ అసోసియేషన్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎండీ.యాకూబ్ పాషాను, హైదరాబాద్కు చెందిన న్యాయవాది సయ్యద్ యూసుఫ్ ఫైసల్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు ఎదుర్కొంటున్న ప్రధానమైన విద్య, ఉపాధి, సంక్షేమానికి సంబంధించిన సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. మైనారిటీలకు సంబంధించిన విధానాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే మైనారిటీలకు విద్య, ఉపాధి రంగాల్లో అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అర్హులకు అందేలా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం సంఘం ఎప్పుడూ ముందుండి పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సయ్యద్ అర్షద్, స్వరాజ్, శైలేందర్ సింగ్, నసీర్ ఖాన్, సిద్ధిఖీ తహసీన్ ఫాతిమా, నిసార్ ఖాన్ పాల్గొన్నారు.

Palvancha : మైనార్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ యాకూబ్ పాషా