Master Plan | కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 15 : ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మాస్టర్ ప్లాన్ (Master Plan) సర్వే చేపడుతున్నట్టు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషంజన స్వామి తెలిపారు. పట్టణాభివృద్ధికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, రాబోయే 30 సంవత్సరాలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా ఈ మాస్టర్ ప్లాన్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ పాత కొత్తగూడెంలో ఈ మాస్టర్ ప్లాన్ సర్వేను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నగరాలకు ధీటుగా పట్టణాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమృత్ పథకం 2.0లో భాగంగా సర్వే చేసి నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఈ సర్వేలో కబ్జాకు గురైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వానికి చెందిన ఆస్తుల, ఇండ్ల వివరాలు, ప్రభుత్వ కార్యాలయాల వివరాలు తదితర అంశాలు తెలుస్తాయన్నారు.
సర్వేలో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టనున్నామని.. బుధవారం వరకు ఈ సర్వే జరగనున్నట్లు కమిషనర్ వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ లో ఈ సర్వేకు ఎంపికయినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ అధికారి బుర్ర గోపాల్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.