– 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ
రామవరం, ఆగస్టు 04 : సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చుంచుపల్లి మండలం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్, నాలేరియా, డి.530 సింగరేణి క్వార్టర్లలో నివాసముండే వాకపల్లి వెంకటరమణ సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తోంది. రోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగులగొట్టి అందులోని 20 తులాల బంగారాన్ని, రూ.2 లక్షల నగదును అపహరించుకుపోయినట్లు ఆమె తెలిపింది. ఫిర్యాదు మేరకు కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రల నమూనాలను సేకరించింది.