బూర్గంపహాడ్, ఏప్రిల్ 6 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారపాక పర్యటన పలు చర్చలకు తావిస్తున్నది. ఓ సామాన్యుడి ఇంటికి భోజనం చేయడానికి వచ్చిన సీఎం మంత్రులతో వచ్చి భోజనం చేసి సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వం చేపడుతుందని చెప్పడానికా? లేదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీతో అన్ని పథకాలు మంచిగా ఇస్తున్నామన్న హింట్ ఇవ్వడానికా? అనేది సందిగ్ధానికి తావిస్తున్నది. ఇందుకు కారణం సామాన్యుడి కుటుంబం కాకుండా ఓ కాంగ్రెస్ యువనేత కుటుంబ సభ్యులు స్వయంగా సీఎం, మంత్రులకు భోజనం వడ్డించడం పట్ల ఇది ప్రేమతో చేసేది కాదని, ప్రచార ఆర్భాటం కోసమేనని పలువురు చర్చించుకుంటున్నారు.
మరోపక్క అర్ధరాత్రి బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాడ్లైన్, మాలమహానాడుకు చెందిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించడం వెనక కారణం ఏమై ఉంటోందోనని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుచేయకపోగా 420 హామీలను అలాగే వదిలేసి ఇటీవల ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీకి సంబంధించి ప్రచారం ఈ విధంగా చేసుకోవాలన్న ఆలోచనతో సామాన్యుడి ఇంటికి ముఖ్యమంత్రి, మంత్రులు భోజనానికి వచ్చారా అనే కోణంలో కూడా ప్రజలు, స్థానికులు, పలు పార్టీల నాయకులు సైతం చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది.