భద్రాచలం, డిసెంబర్ 04 : భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ స్థానం దాదాపు బీఆర్ఎస్ పరమైనట్లేనని, ప్రజల ఆశీర్వాదాన్ని చూస్తే అలాగే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్, సిపిఎం, గోండ్వానా దండకారణ్య పార్టీ, ఆదివాసి జేఏసీ సంయుక్త కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బలపరుస్తున్న మానే రామకృష్ణ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పట్టణంలో నిర్వహిస్తున్న ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన లభిస్తోంది. గురువారం భద్రాచలం పట్టణంలోని 9, 11, 18, 19, 20 వార్డుల్లో మానే రామకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. ఆయా వార్డుల్లో ప్రజలు మానేకు బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా మానే మాట్లాడుతూ.. తనకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే భద్రాచలం పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమస్యలను తక్షణమే పరిష్కరించి భద్రాద్రి పుణ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ఉండేలా శక్తి వంచన మేరకు కృషి చేస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మానే రామకృష్ణ గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. భద్రాచలం పట్టణంలోని లంబాడి కాలనీ, రిక్షాకాలనీ, జగదీష్ కాలనీలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సరళిని ఆయన పరిశీలించారు. నాయకులకు, కార్యకర్తలకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కొందరు ధన దాహంతో కుట్రలకు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానే గెలుపు తధ్యమని దీన్ని ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

Bhadrachalam : భద్రాద్రిలో ‘మానే’ విస్తృత ప్రచారం