జూలూరుపాడు, మే 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బ (Heatstroke) మరణాలు పెరుగుతున్నాయి. జూలూరుపాడు మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని పెద్ద హరిజనవాడకు చెందిన ఇసన్నపల్లి కృష్ణ (35) వడదెబ్బ బారిన పడి బుధవారం మృతి చెందాడు. వడదెబ్బ లక్షణాలతో తీవ్రంగా బాధపడిన కృష్ణను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా.. ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం తమ కుమార్తె ఓణీల అలంకరణ వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగిన మరిసటి రోజు కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా నీరసించిపోవడంతో పాటు వరుసగా వాంతులు, విరోచనాలయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు.
ప్రాథమిక చికిత్స అందించినా వడదెబ్బ తీవ్రతకు కృష్ణ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆయనను అత్యవసరంగా జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్య పరిస్థితి విషమించి కృష్ణ తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య స్వాతి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్దిదిక్కైన కృష్ణ మరణంతో తాము దిక్కులేనివాళ్లమయ్యామని కుటుంబసభ్యులు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. కృష్ణ మృతితో పెద్ద హరిజనవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.