హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్‌పరం అవుతుంటే కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలికేలా చర్యలు ఉండటం గమనార్హం. ప్రభుత్వ సంస్థ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేస్తున్నారని తెలిసినా… ఎవరూ దీనిపై స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ‘ముఖ్యనేత’ ముఠా నుంచి ఆదేశాల మేరకే అధికారులంతా గప్‌చుప్‌గా ఉన్నారా? లేక మిలాఖత్ అయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని సుమారు మూడున్నర ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి గత 35 ఏండ్లుగా ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్నది. అయినప్పటికీ, ఏకపక్షంగా ఆ భూమిని ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేసేందుకు చర్యలు తీసుకొన్నారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 12వ తేదీన ‘రూ.500 కోట్ల భూమి హాంఫట్’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనం ఇటు పరిశ్రమల శాఖ, అటు వ్యవసాయ శాఖ, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కథనంపై, భూమిపై అధికారులు ఆరా తీశారు.