బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో గోల్మాల్ జరిగిందని పాత పాలకవర్గానికి చెందిన ఉపసర్పంచ్ చిప్పా సుధాకర్ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు వ్యవహారం కాస్తా మండలంలో సోషల్ మీడియా, పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో అతడిపై కొందరు దాడికి యత్నించారు.
పంచాయతీలో నిధుల వినియోగంలో గోల్‌మాల్‌పై చిప్పా సుధాకర్ ఉదయం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయితే.. ప్రస్తుత పాలకవర్గంలో కొందరు వ్యక్తులు అధికార పార్టీ నాయకుల అండదండతో చిప్పా సుధాకర్, అతడి అనుచరులపై దాడికి యత్నించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వత్తిడి తెచ్చేందుకు ఈ ఘటన చోటుచేసుకుందా? లేదా తప్పుడు సమాచారంతో ప్రజావాణిలో చిప్పా సుధాకర్ ఫిర్యాదు చేశారా? అన్నదానిపై స్పష్టత రాలేదు.
పంచాయతీలో నిధుల విషయంలో వాస్తవంగా అవకతవకలు జరిగాయా? లేదా..? అన్నది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దాడి ఘటనపై బూర్గంపహాడ్ ఎస్సై మేడా ప్రసాద్‌ను వివరణ కోరగా.. సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేశామని వివరణ ఇచ్చారు.