నాయకుల నియంతృత్వ ధోరణికి అధికారుల ఆత్మవంచన తోడైతే పాలన ఎంత దిగజారుతుందో చెప్పడానికి తాజా తెలంగాణలోని పరిణామాలే ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వం, అధికార వ్యవస్థ కలిసి కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ, న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే.. బ్యూరోక్రాట్లు ‘జీ హుజూర్’ అంటూ అమలు చేస్తున్నారు.
అధికారులు తమ విచక్షణను పకనబెట్టి సంతకాల యంత్రాలుగా మారుతుండటంపై న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆదేశాలు ఇస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు కోర్టుల పట్ల సర్కార్ వైఖరిని అలుసుగా తీసుకొని కొందరు అధికారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కోర్టుల్లో వందలాదిగా ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తహసీల్దార్ వరకు అనేక మంది కోర్టు మెట్లెక్కాల్సి వస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ పథకాలనూ నిలిపివేయాల్సి వస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తెలంగాణ పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే రాజ్యాంగబద్ధ వేదికపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అత్యున్నత న్యాయస్థానం మందలించడంతో క్షమాపణలు చెప్పగా, పాలకుల హుకుంలకు సంతకాలు పెట్టే యంత్రాలుగా మారిన ఉన్నతాధికారులు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతుండటమే అందుకు నిదర్శనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ‘ఉప ఎన్నికలు రావు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఇది 10వ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే అని కన్నెర్ర చేయడంతో, సీఎం క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. ‘యథా రాజా తథా యంత్రాంగం’ అన్నట్టుగా రెండున్నరేండ్ల కాలంలో కొందరు ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లు, సీనియర్
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా హైకోర్టు మెట్లెక్కుతున్నారు.
కొందరిపై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. మరికొందరిని పోస్టు నుంచి తప్పించాలని కోర్టు నేరుగా ఆదేశించింది. ఇంకొందరిపై కోర్టు ధికరణ నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ శాఖలపై 5 వేలకు పైగా కోర్టు ధికరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాల అంచనా. ఆర్థిక శాఖపైనే 2 వేలకు పైగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు.
ప్రభుత్వం బాధ్యతారాహిత్యం
సాధారణంగా ప్రభుత్వాలు న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ గౌరవిస్తుంటాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను ఏమాత్రం లెక్కచేయడం లేదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు రెండున్నరేండ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, దానిని అలుసుగా తీసుకొన్న అధికార వ్యవస్థ చేస్తున్న ధిక్కరణ కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం మొదటి నుంచీ చట్టవిరుద్ధమైన, న్యాయసమీక్షకు నిలబడని, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది. వీటిపై కోర్టులు సమీక్షించి ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఉత్తర్వులనూ పాటించడం లేదు, కౌంటర్లు ఇవ్వడమే లేదు. ఫలితంగా అధికారులు కోర్టు మెట్లెక్కుతూ, బోనులో నిందితుల్లా నిలబడుతున్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేసి తీసుకురావాలని కోర్టు ఆదేశించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కోర్టుల పట్ల చూపుతున్న అమర్యాదను, అగౌరవాన్ని అలుసుగా తీసుకొని కొందరు అధికారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు హైడ్రానే ప్రత్యక్ష ఉదాహరణ. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని అనేకసార్లు చెప్పినా వినలేదు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఫలితంగా హైడ్రాపై 63 ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ప్రభుత్వం, అధికార వ్యవస్థ కలిసి కోర్టులను నిర్లక్ష్యం చేస్తున్నాయనేది, ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నాయనేది సుస్పష్టం.
కౌంటర్ దాఖలులోనూ నిర్లక్ష్యం
విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని కోర్టులు ఆదేశించడం పరిపాటి. దానికి అనుగుణంగా ఆయా శాఖలు అఫిడవిట్ సిద్ధం చేసి, తమ వాదనకు జోడిస్తాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కనీస బాధ్యతను కూడా విస్మరించింది. ఇందుకు బుధవారం జరిగిన ఉదంతమే తాజా ఉదాహరణ. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు రాజ్యాంగబద్ధతపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. నాలుగు వారాలు గడువు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో రెండు పథకాల అమలును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఆడబిడ్డల పెండ్లి చేసి సాయం కోసం చూస్తున్న ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం చేసింది.
జీవితకాలం జైల్లోనే ఉంటారా?
రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాపై ఏకంగా బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీకావడం ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) వర్గాల్లో సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన రూ.33.42 కోట్ల స్టాంప్ డ్యూటీ సర్‌చార్జి బకాయిలను వెంటనే విడుదల చేయాలని 2024 డిసెంబర్లో ఇచ్చిన తీర్పును, ఆ తర్వాత కోర్టు ఇచ్చిన రెండు నోటీసులను ఆర్థిక శాఖ పట్టించుకోలేదు. దీంతో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు కాగా, జస్టిస్ నగేశ్ భీమపాక తీవ్ర ఆగ్రహంవ్యక్తంచేస్తూ ‘సుల్తానియా ఎకడున్నా అదుపులోకి తీసుకొని మా ఎదుట ప్రవేశపెట్టాలి’ అని హైదరాబాద్ సీపీని ఆదేశించారు. చివరికి ఆయన ధర్మాసనం ముందుకు రాగా, ‘మీపై పెండింగ్‌లో ఉన్న అన్ని కోర్టు ధికరణ కేసుల్లో శిక్ష విధిస్తే.. జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది’ అని న్యాయమూర్తి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.
సందీప్‌కుమార్ ఝాపై ఘాటు కామెంట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కొన్ని నెలలుగా తరచూ హైకోర్టు ఆగ్రహానికి గురవుతూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితురాలికి నష్టపరిహారం చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయినా పరిహారం చెల్లించకపోగా, ఆమెపై అక్రమ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్లను కలెక్టర్ ఝా ఆదేశించడంపై హైకోర్టు మండిపడింది. దీనిపై బాధితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ విచారణ జరిపారు. కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కలెక్టర్‌ను మందలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్‌కు ‘డ్రెస్సింగ్ సెన్స్’ లేదని, ఆయనను చూస్తేనే భయంగా ఉన్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతోపాటు, భూసేకరణకు సంబంధించిన మరో కేసులో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకరిపై వారెంట్ జారీ అయింది.
అటవీ విధ్వంసానికి బాధ్యులెవరు?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) సరిహద్దుల్లోని దాదాపు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల్లో ఐటీ పారు నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ల దండయాత్ర, చెట్ల నరికివేతపై విద్యార్థులు, పర్యావరణ వేత్తలు ఉద్యమించడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు తలుపుతట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అదంతా అటవీ భూమి అని, అక్కడ వణ్యప్రాణులు నివాసం ఉంటున్నాయని అధికారులకు తెలియదా? కానీ, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలు, ఒత్తిళ్లతో విధ్వంసానికి పూనుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి, యంత్రాంగానికి షాక్ నిచ్చాయి. కనీస పర్యావరణ అనుమతులు, అటవీశాఖ క్లియరెన్సులు లేకుండా ఎవరి ఆదేశాలతో చెట్లను నరికేస్తున్నారని సుప్రీంకోర్టు నిలదీసింది. ‘పర్యావరణానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడవిని కాపాడటంలో విఫలమైతే సీఎస్‌తోపాటు సంబంధిత శాఖల కార్యదర్శులందరినీ జైలుకు పంపుతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు జైలు హెచ్చరికలతో ఉలికిపడిన ప్రభుత్వం.. ఆ భూములు అటవీశాఖ పరిధిలోకి రావని నిరూపించేందుకు శాటిలైట్ ఆధారాలతో 56 పేజీల భారీ అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేసింది. పాలకుల అజెండా కోసం ప్రకృతిని ధ్వంసం చేసే చర్యలకు ఆమోదం తెలిపితే ఎవరైనా కటకటాల వెనకి వెళ్లక తప్పదని ఈ కేసు ద్వారా న్యాయస్థానం స్పష్టమైన సంకేతాలిచ్చింది.
బాధితులు.. అపరాధులు
న్యాయవ్యవస్థపై జరుగుతున్న ఈ ధిక్కార ప్రక్రియలో అధికారులు బాధితులుగా, అపరాధులుగా మారుతున్నారు. పాలకుల అక్రమ ఆదేశాలకు తలవంచి, రాజ్యాంగాన్ని తాకట్టు పెడుతున్న బ్యూరోక్రాట్లు అమాయక బాధితులు ఎంతమాత్రమూ కాదన్నది నిపుణుల మాట. చట్టాన్ని చదివి, రాజ్యాంగ పరిమితులను వడబోసి పీఠాలెకిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు పాలకుల చట్టవిరుద్ధమైన హుకుంలను తిరసరించే అధికారం, అభ్యంతరం చెప్పే వెసులుబాటు స్పష్టంగా ఉంటాయి. అయినా సరే.. ఏదో ఆశించి ‘ఎస్ బాస్’ అని సంతకాలు పెట్టే అధికారులు కూడా రాజ్యాంగ విచ్ఛిన్నంలో సమాన భాగస్వాములేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సల్కం చెరువు ఆక్రమణపై..
హైదరాబాద్‌లోని సలం చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, పార్టీ-ఇన్-పర్సన్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు 2026 ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు పరిధిలో ఒక విద్యాసంస్థ నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై వివరణాత్మక విచారణ జరిపి, సమగ్ర నివేదికను తదుపరి విచారణలోగా సమర్పించాలని రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. సదరు విద్యాసంస్థలు ఒక రాజకీయ నాయకునివి కావడంతో నిర్దేశిత గడువులోగా నివేదిక సమర్పించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైగా హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ కలిసి 2026 జులై 9న విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీంతో అధికారుల క్రమశిక్షణా రాహిత్యంపై ధర్మాసనం విరుచుకుపడింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ముఖ్య కార్యదర్శులు యోగితా రాణా, ఈ శ్రీధర్, లోకేశ్‌కుమార్ సహా ఐదుగురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.
హైడ్రా బుల్డోజర్పై ‘ధర్మా’గ్రహం
చెరువుల పునరుద్ధరణ పేరుతో చట్టాలను, న్యాయస్థాన ఉత్తర్వులను తుంగలో తొక్కి బుల్డోజర్ న్యాయం చేస్తున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వైఖరిపై తెలంగాణ హైకోర్టు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధికరణ పిటిషన్లు నమోదవడంపై దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. సాధారణంగా అధికారులు కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంటారు.
కానీ, హైడ్రా మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించింది. శని, ఆదివారాల్లో జరిపిన కూల్చివేతలను ఎన్నిసార్లు తప్పుబట్టినా పట్టించుకోలేదు. నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ భూముల్లోకి వెళ్లొద్దన్న ఆదేశాలను కూడా వినిపించుకోలేదు. ఫలితంగా ‘హైడ్రా చీఫ్ తనకు చట్టం వర్తించదని, తాను అన్నింటికీ అతీతుడినని అనుకుంటున్నారా?’ అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గలేదు. ఫలితంగా.. తమ ఉత్తర్వులను పదేపదే బేఖాతరు చేయడం నేరమని స్పష్టంచేస్తూ, ఆయన్ను వెంటనే కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించేవరకు వెళ్లింది.