Kalyanalakshmi | కల్యాణ లక్ష్మిపై స్టే.. రాష్ట్ర ప్రభుత్వ అలక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ పథకాల రాజ్యాంగబద్ధతపై దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గడువు ఇచ్చినా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆపేయండి!
- రాష్ట్ర ప్రభుత్వ అలక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం
- పథకాల అమలుకు సంబంధించిన 8 జీవోలపై స్టే
- చెల్లింపులూ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు
- రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం
- నాలుగు వారాలుగా కౌంటర్ వేయని ఫలితం
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ పథకాల రాజ్యాంగబద్ధతపై దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గడువు ఇచ్చినా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ పథకాల అమలుకు 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోల అమలును నిలిపివేస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోల ఆధారంగా గుర్తించిన లబ్ధిదారులకు చెల్లింపులు కూడా చేయరాదని స్పష్టంచేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ విచారణ చేపట్టారు. గత నెల 8న జరిగిన విచారణ సందర్భంగా.. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖలతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ధర్మాసనం విచారణ జరిపింది.
రెండు పథకాలు చట్టబద్ధం కాదు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2014లో ప్రారంభించిన ఈ పథకాలకు చట్టపరమైన, శాసనపరమైన ఆధారం లేదన్నారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా పథకాలను కొనసాగిస్తూ అర్హతలు, ఆదాయ పరిమితులు నిర్ణయించడం చట్టబద్ధం కాదని వాదించారు. చట్టసభల ఆమోదం లేకుండా కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమన్నారు. అధికరణ 246 ప్రకారం చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంట్, శాసనసభలకు మాత్రమే ఉన్నదని, ఆ అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ వినియోగించలేదని వాదించారు. పథకాల కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వివరాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 2014 నుంచి 2026 వరకు ఈ రెండు పథకాల కింద సుమారు రూ.13,484.69 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం భారీగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నందున దానికి చట్టపరమైన ఆధారం ఏమిటో స్పష్టంచేయాల్సి ఉన్నదన్నారు. పథకాల కింద ఆర్థిక సాయం ప్రారంభంలో రూ.51 వేలుగా ఉండగా.. పలు దఫాలుగా పెరిగి రూ.1,00 ,116కు చేరిందని, వికలాంగులకు మరింత అదనంగా సాయం అందిస్తున్నదని తెలిపారు.
కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం
గత నెలలో విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హాజరై.. ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే గడువు పూర్తయినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. మరోసారి గడువు కోరింది. దీంతో న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కీలకమైన రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను ఈ పిటిషన్లో లేవనెత్తారని, కాబట్టి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 2014 నుంచి పథకాల అమలుకు జారీ చేసిన 8 జీవోల అమలుపై మధ్యంతర స్టే విధించారు. ఆ జీవోల ఆధారంగా గుర్తించిన లబ్ధిదారులకు చెల్లింపులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

