హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు కూల్చివేత చర్యలు చేపడుతున్నామంటూ ఇంతకాలం హైడ్రా చేస్తున్న వాదన న్యాయస్థానంలో వీగిపోయింది. రెవెన్యూ అధికారుల ఆదేశాలు, విజ్ఞప్తుల మేరకే కూల్చివేతలు చేపడుతున్నామంటున్న హైడ్రా బాగోతం బుధవారం హైకోర్టులో బట్టబయలైంది. కూల్చివేతలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడంతో హైడ్రా పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక’లా మారింది. కూల్చివేత ల సమయంలో అకడ రెవెన్యూ అధికారులెవరూ లేరని తహసీల్దార్లు తేల్చిచెప్ప డం, ప్రభుత్వ భూమిగా ఎవరు నిర్ధారించారో చెప్పలేకపోవడం, కూల్చివేతలను సమర్థించుకునేందుకు హైడ్రా కనీసం ఒక కాగితం ముకను కూడా ఆధారం గా చూపలేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అది ప్రభుత్వ భూమి అని కలెక్టర్, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించకుండానే ప్రైవేట్ స్థలంలోకి ఎలా వెళ్లారు? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేత లు చేపడుతారా? ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతారా?’ అని నిలదీసింది.
కూల్చివేతలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్ హైకోర్టుకు స్పష్టం చేయడంతో హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ప్రభుత్వ భూముల రికార్డులన్నీ కలెక్టర్ ఆధీనంలో ఉంటాయని, అలాంటి కలెక్టర్ ధ్రువీకరించకుండానే హైడ్రా ఎలా కూల్చివేతలు చే పడుతుందని ప్రశ్నించింది. హైడ్రా నిర్వా కం వల్ల కూల్చివేతలపై వివరణ ఇచ్చేందుకు అధికారులు పదేపదే న్యాయస్థానాలకు రావాల్సి వస్తున్నదని, దీంతో ఎంతో విలువైన కోర్టు సమయం వృథా అవుతున్నదని అసహనం వ్యక్తం చేసింది. 2022 లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ డీఆర్వో ఆదేశాలు లేకుండా కూల్చివేతలు చేపట్టడం కోర్టు ధికరణ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. దీన్ని సుమోటోగా స్వీకరించి హైడ్రాకు కోర్టు ధికరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మేడ్చల్-మలాజిగిరి జిల్లా పరిధిలోని 194/1, 211 సర్వే నంబర్లలో వాణీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల ప్రహరీ గోడలను హైడ్రా కూల్చివేయడా న్ని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ చర్య చేపట్టడాన్ని సవాలు చేస్తూ పీచర లింగారావు, మరో ఆరుగురు దాఖలు చేసి న పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా పదే పదే చెప్తుండటంతో కలెక్టర్, తహసీల్దార్లను పిలిపించి వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. కూల్చివేతల సమయంలో అక్కడ రెవెన్యూ అధికారులెవరూ లేరని తిరుమలగిరి, మలాజిగిరి తహసీల్దార్లు స్పష్టం చేశారు. కూల్చివేతలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో హైడ్రా ఇంతకాలం చేస్తున్న వాదనపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. కలెక్టర్‌కు కూడా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. ‘మీ కార్యాలయం పరిధిలో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యా యి? అవి ఏ దశలో ఉన్నాయి? బాధ్యత లు చేపట్టిన వెంటనే వాటి గురించి తెలుసుకోరా? కోర్టు కేసులు ఏ దశలో ఉన్నాయో చెప్పేందుకు మీ వద్ద అధికారి లేరా? కోర్టు ఆదేశాల గురించి మీరు తెలుసుకోరా? అంటూ నిలదీశారు.
40 కూల్చివేతలపై ఆరా
మలాజిగిరి పరిధిలో 40 కూల్చివేత లు చేపట్టినట్టు హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో వాటిలో ఎ న్నింటికి అనుమతులు ఉన్నాయని కలెక్టర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేశారు. మలాజిగిరి పరిధిలో హైడ్రా చేపట్టిన ఇతర కూల్చివేతలపై కూడా కోర్టు దృష్టి సారించినట్టయింది.
ప్రభుత్వ భూమిగా ఎవరు తేల్చారు?
కూల్చివేతలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్, రెవెన్యూ అధికారులు చెప్పడంతో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ఎవరు నిర్ధారించారని హైడ్రాను న్యాయమూర్తి నిలదీశారు. ‘ప్రభుత్వ సర్వేయర్లు రాకపోతే ప్రైవేట్ సర్వేయర్‌ను పెట్టుకున్నారా? ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మారింగ్ చేసిందెవరు? రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ధ్రువీకరించకుండానే ప్రైవేట్ స్థలంలోకి ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి స్పందిస్తూ.. 194 సర్వే నంబర్లో 12 ఎకరాల పట్టా భూమి ఉన్నదని, అందులో 4 ఎకరాలు పట్టణ గరిష్ఠ పరిమితి (యూఎల్సీ) చట్టం కింద ప్రభుత్వానికి వచ్చాయని తెలిపారు.